||సుందరకాండ ||

||తత్త్వదీపిక - ఏడవ సర||

||తత్త్వ దీపిక:"పుష్పక విమానము చూచుట"||

||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తమస్సర్గః

తత్త్వదీపిక:
"సుందరే సుందరః కపిః"

ఈ ఏడవ సర్గ లో ముఖ్యముగా మనము చూచేది వినేది రావణ ఐశ్వర్యము.
అందులో స్వర్ణమయమై మనోహరము గా
అతని ఆత్మబలమునకు అనుగుణముగా పైకిలేచిన,
మేఘములా వున్న ఆ రక్షోధిపతి భవనము.
ఆ భవనము "అప్రతిరూపరూపం" అసమానమైన రూపము కలది.

ఆ ఐశ్వర్యమంతా "స్వబలార్జితాని",
అంటే రావణుడు సంపాదించినదే అని.
అవన్నీ "దోషైః పరివర్జితాని" అంటే దోషములు లేనివి
అక్కడ ఇంకొకటి కనిపిస్తుంది.
అక్కడే విరాజిల్లు చున్న ,
అనేకమైన రత్నములతో అలంకరింపబడియున్న,
పుష్పకము అను పేరుగల మహావిమానము.
ఇవన్నీ చూస్తూ హనుమంతుడు "సవిశ్మయః" అశ్చర్యచకితుడాయెను.

కాని ఆ హనుమంతుడు రావణాసురునిచే పాలింపబడు ఆ నగరములో
సీతాన్వేషణకై తిరుగుతూ,
"పతిగుణవేగనిర్జితామ్" అంటే భర్తయొక్క గుణసంపత్తిచే జయింపబడిన,
"సుపూజితామ్" పూజనీయమైన ఆ జనక సుతను
కానక అత్యంత దుఃఖము కలవాడయ్యెను.

ఆ జనకసుతను కనుగొనలేక
"బహువిధాత్మనః" అనేకవిధములైన ఆలోచనలు కల,
"కృతకార్యః"అనుకున్నపని సాధింపగల,
సునిశిత దృష్టికల, మహాత్ముడు హనుమ
"అతి దుఃఖితం మనః" అంటే అతి దుఃఖముకల మనస్సు కలవాడయ్యెను.

అది ఈ సర్గలో కథ.

ఇక ఇక్కడి అంతరార్థము చూద్దాము. :

అంత అత్యంత సుందరమైన వస్తువు చూసినపుడు
ఎవరికైన బాహ్యమైన ఆనందము కలుగుతుంది.
ఆ ఆనందముతో కొందరు ఆ ఆనందమే ధ్యేయముగా ఉన్న మార్గము పట్టవచ్చు.
కాని అత్మ అన్వేషణలో నున్న వారికి ఈ బాహ్యమైన ఆనందము గమ్య స్థానము కాదు.
వారు అంతర్గతమైన పరమానందము కొసము,
తపనపడుతూ ఇంకా ముందుకు పోతారు.
అలాగే ఇక్కడ హనుమంతుడు గూడా అంతా చూసినా,
చివరికి సాధ్వి సీతాదేవి కనపడలేదని దుఃఖపడతాడు.
కాని అన్వేషణలో ముందుకు పోతాడు.

మనకు అదే మాట,
అంటే ఆత్మాన్వేషణలో ఉన్నవారికి బాహ్యమైన అనందము గమ్యస్థానము కాదు అన్నమాటే,
కథోపనిషత్తులో యమ నచికేతుల సంవాదములో వినిపిస్తుంది.
యముడు నచికేతునికి చెపుతాడు.
ప్రతి మార్గములో "శ్రేయము" "ప్రేయము" అనబడే మార్గములు కనిపిస్తాయి.
ఆత్మ అన్వేషణలో ఉన్నవాడు శ్రేయో మార్గములో వెళ్ళును.
ప్రియమైన వస్తువులపై ధ్యానము కలవాడు ఆత్మాన్వేషణలో విఫలుడు అవుతాడు అని.

ఇక్కడ హనుమంతుని స్వరూపము చిత్రీకరిస్తూ వాల్మీకి ఇలా రాస్తాడు.

హనుమంతుడు

- బహువిధ భావితాత్ముడూ - 'బహువిధం యథా భవతి తథా చింతితాత్మన"
అంటే బహువిధములుగా ఎలా జరుగునో అది చింతించగలిగినవాడు.
అదే బహువిధములుగా ఆత్మగురించే భావన చేయువాడు.
బహు విధములుగా పుష్పక విమాన వర్ణన చేసిన వాల్మీకి,
హనుమంతుడు అంతకన్నా ఎక్కువగా,
బహువిధములుగా ఆత్మగురించి భావన చేయువాడు అని ప్రశంసాత్మకముగా అంటాడు

- కృతాత్ముడు- ' శిక్షితాంతః కరణః',
-అంతఃకరణమును శిక్షణలో ఉంచినవాడు.
ఆత్మనే తప్పక పొంద వలనని ప్రయత్నము చేసినవాడు, చేయుచున్నవాడు.
సముద్ర లంఘనములో మైనాకుడు విశ్రాంతికోసము ఆగమంటే,
"ప్రతిజ్ఞా చ మయా దత్తా న స్థాతవ్యమిహాంతరే" అంటూ,
అంటే తన అన్వేషణ అయ్యేదాకా మధ్య లో ఆగనని ప్రతిజ్ఞచేసినవాడను అని అంటాడు.
అదే కృతాత్ముడు.

- సువర్త్ముడు - 'శోభనమార్గావలమ్బినః'
శుభకరమైన మార్గమునందు నడుచువాడు.
నీతి తప్పని మార్గమున నడచువాడు.
మొదటి సర్గలో మొదటి శ్లోకములో "చారణా చరితే పథి" అంటూ చెప్పిన మాటకూడా అదే,
గురుతుల్యులు వెళ్ళు మార్గములో వెళ్ళువాడు.
తను సాగరలంఘనము చేయు ముందర ,
సదా చార సంపన్నుడగు హనుమ సూర్యుడు మున్నగు దేవతలకు నమస్కరించి
అప్పుడు సాగర లంఘనముకు ఉద్యమించును.
అదే సువర్త్ముడు అన్నమాట.

- సుచక్షువు- దేహము ఆత్మ వేరు అని తెలిసికొని,
ఆత్మను చూడగలగిన సూక్ష్మ దర్శి అగు అంతర నేత్రములు కలవాడు.
హనుమంతుడు లంకలో దిగి త్రికూట శిఖరముపై నుంచుని
దేదీప్యమానముగా దివిదేవపురిలాగా వెలుగుతున్న,
భోగలాలసలకు స్థానమైన లంకను,
భోగలాలసలకు స్థానమైన శరీరమును చూడగలిగినట్లు చూడగలిగిన చక్షువులు కలవాడు.
అదే సుచక్షువు అంటే.

ఇవన్నీ హనుమంతుని గుణములు.

సుందరే సుందరో రామః
అన్నమాటకి ఇవే నిదర్శనము అని కూడా అనుకోవచ్చు.

సుందరకాండ సుందరుని ఈ గుణముల వలనే సుందర కథ అని అనబడినది కాబోలు.

||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||